పోక్సో కేసుల్లో యావజ్జీవ శిక్ష ..మరో నలుగురికి   25, 20, ఐదేండ్ల చొప్పున జైలు : షీ టీమ్స్ డీసీపీ లావణ్య జాదవ్

పోక్సో కేసుల్లో యావజ్జీవ శిక్ష ..మరో నలుగురికి   25, 20, ఐదేండ్ల చొప్పున జైలు : షీ టీమ్స్ డీసీపీ లావణ్య జాదవ్

హైదరాబాద్​ సిటీ, వెలుగు :  హైదరాబాద్​కమిషరేట్​పరిధిలో ఇటీవల ఐదు వేర్వేరు పోక్సో  కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు పడ్డాయని విమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ పి. లావణ్య నాయక్ జాదవ్ తెలిపారు.  బేగంపేట, బంజారాహిల్స్, భవానీ నగర్, ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన ఐదు పోక్సో కేసుల్లో సెషన్స్ కోర్టులు, ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టులు ఈ తీర్పులు ఇచ్చాయన్నారు.

ఈ కేసుల్లో  12 ఏండ్ల కూతురిపై లైంగికదాడి చేసిన తండ్రికి  యావజ్జీవ శిక్ష, తొమ్మిదేండ్ల బాలికపై అత్యాచారం చేసిన పొరుగింటి వ్యక్తికి 25 ఏండ్ల జైలు, 8 ఏండ్ల బాలికను ప్రలోభపెట్టి అఘాయిత్యం చేసిన వ్యక్తికి 20 ఏండ్లు,  4 , 8 సంవత్సరాలున్న చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడిన మరో ఇద్దరికి 5 ఏండ్ల చొప్పున శిక్షలు పడ్డాయన్నారు. అలాగే, బాధితులకు  రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించిందని డీసీపీ వివరించారు. ఈ కేసుల విచారణ సందర్భంగా భరోసా కేంద్రం మానసిక,  వైద్య, న్యాయ సలహాలు అందజేసిందని, అవి కోర్టులు కఠిన తీర్పులు ఇవ్వడానికి ఉపయోగపడ్డాయన్నారు.